విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ మన్యంలో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలతో పలుప్రాంతాలు జలమయం అయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న వానలతో కొవ్వాడ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు లోతట్లు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని బుట్టయగూడెం, జగన్నాథపురంలో భారీ వర్షంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో భారీవర్షానికి గోదుమవాగు పొంగిపొర్లుతోంది. రామవరంలో వరద నీటిలో వంతెన నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో ఇన్‌ఫ్లో 36 వేల క్యూసెక్కులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 834.20 అడుగులుగా ఉంది.
Page(s):1