హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అక్రమాలను నిరసిస్తూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో అదే కార్యక్రమాన్ని తాము నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. టిటిడిపై చిరంజీవి సాగిస్తున్న పోరాటాన్ని హైజాక్ చేసే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ పాదయాత్ర తలపెట్టినట్లు భావిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై అలిపిరినుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టాలని తెలుగుదేశం గురువారం నిర్ణయించింది.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలో అక్రమాలు, రాయలవారి నగల వ్యవహారం, తదితరవాటితో తిరుమల పవిత్రతకు వాటిల్లుతోందని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఆగస్టు 4 లేదా 5 తేదీల్లో ఈ యాత్రను నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బాబ్లీపై, ముఖ్యమంత్రి కె. రోశయ్య పనితీరుపై కూడా ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
Page(s):1