హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అల్టిమేటానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దిగి వచ్చినట్లే కనిపిస్తోంది. బాబ్లీ సమస్యను ఆగస్టు పదవ తేదీలోగా పరిష్కరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. బాబ్లీపై రాష్ట్ర అఖిల పక్ష సమావేశంలో ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని సమక్షంలో ఆగస్టు 2వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ప్రధాని కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యల మధ్య ఆగస్టు 2వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
Page(s):1